ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాడు. అంతే కాదు…టీడీపీ ఆధ్వర్యంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు పవన్ మద్దతు ఇస్తున్నాడు. అయితే పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి మాత్రం మూడు రాజధానులపై సీఎం జగన్ ప్రకటనను స్వాగతించారు. అధికార, పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి సీఎం జగన్ కృషి చేస్తారన్న నమ్మకం తనకుందంటూ చిరు వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు పార్టనర్ పవన్‌కల్యాణ్‌కు వంత పాడుతున్న ఎల్లోమీడియా.. సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన చిరంజీవిపై మాత్రం గుర్రుగా ఉంది. అందుకే చిరును దగ్గరుండి తిట్టించే పనిలో పడింది.
అమరావతి ప్రాంతంలోని తుళ్లూరులో టీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలకు వెళ్లి కొందరి దగ్గర మైకులను పెట్టి…మూడు రాజధానులపై స్వాగతించిన చిరంజీవిపై మీ అభిప్రాయం ఏంటని వాళ్లను రెచ్చగొట్టే పనిలో పడింది. ఎల్లోమీడియా గొట్టాలు కనపడగానే పూనకాలు వచ్చినట్లు ఊగిపోతూ..పవన్‌ను పొగుడుతూ..చిరును దుమ్ముత్తిపోస్తున్నారు. పవన్ కల్యాణ్ మాకు సపోర్ట్ చేయడం సంతోషంగా ఉంది. కానీ చిరంజీవి ఇలా స్వాగతిస్తున్నట్లు ప్రకటించడం పద్ధతి కాదు. చిరు ఏ రోజూ ప్రజా సమస్యల మీద మాట్లాడింది లేదు.. పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మూడు రాజధానులను ఎలా సమర్థిస్తారు..? ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోండి. మీ సినిమాలు చూడటానికి.. ఆడించుకోవటానికి జగన్‌గారిని కలిశారు కానీ.. ఏనాడూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. అసలు మీరు ఆంధ్రాలో ఉంటున్నారో..? వైజాగ్‌లో ఉంటున్నారో..? హైదరాబాద్‌లో ఉంటున్నారో..? జనాలకు తెలియని పరిస్థితి’ అని రాజధానికి చెందిన ఓ రైతు పేరుతో ఎల్లోమీడియా చిరుపై విషం కక్కింది. ఇక ఇంకో వ్యక్తి మాత్రం పిచ్చిపట్టినట్లు మెగాస్టార్‌పై ఊగిపోయాడు…‘చిరుకు వైజాగ్‌లో చాలా ఆస్తులున్నాయి. అందుకే మూడు రాజధానులు నాకు ఇష్టమని అన్నారు. చిరంజీవి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో చిరు సినిమాలు రిలీజ్ చేయనివ్వం. రైతుల గురించి మీకు తెలుసు కాబట్టి.. రైతులు పెట్టే అన్నమే మీరు తింటున్నారు కాబట్టి మాకు మద్దతివ్వండి’ అంటూ సదరు వ్యక్తి ఎల్లోమీడియా గొట్టం ముందు ఊగిపోయాడు. కాగా.. ఈయన రైతు కాదు సినీ ఇండస్ట్రీలోనూ పనిచేస్తున్నాడని సదరు ఎల్లోమీడియా ఛానల్ చెప్పుకొచ్చింది. ఇలా నలుగురైదుగురు రైతులు చిరుపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటూ సదరు ఎల్లోమీడియా ప్రతినిధి చెప్పుకొచ్చాడు. మొత్తంగా మూడు రాజధానులను గుడ్డిగా వ్యతిరేకిస్తున్న బాబుగారి పార్టనర్ పవన్‌కల్యాణ్‌కు పల్లకీ మోస్తున్న ఎల్లోమీడియా సీఎం జగన్‌కు విజ్ఞతతో మద్దతు పలికిన చిరంజీవిపై మాత్రం ఇలా అక్కసు తీర్చుకుంటోంది.