తెలంగాణ వ్యాప్తంగా విజయవంతమైన కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్ ప్రొఫైల్ ఉంటుంది. హెల్త్ ప్రొఫైల్ ప్రక్రియను గజ్వేల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నాను అని సీఎం తెలిపారు. హెల్త్ ప్రొఫైల్ ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది.
ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. గజ్వేల్ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలి. దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలి. త్వరలోనే గజ్వేల్ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. గజ్వేల్ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.