ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో రాజధాని అమరావతి అంశం చర్చించబడింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ప్రజలలో అయోమయం ఏర్పడిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నలు సంధించారు.కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఉన్నదని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే ప్రశ్నపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తామని రాజధానిని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియజేశారు. అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి రాజధాని విషయంలో దుమారం లేపారని ప్రతిపక్షంపై మండిపడ్డారు. టీడీపీ హయాంలో రాజధానిలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులకు కాస్త ఊరట లభించిందనే చెప్పాలి. ముఖ్యంగా రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని చెప్పడం శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అయితే దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో తమ నిర్ణయాన్ని తెలియచేయాలంటూ టిడిపి నాయకులు విమర్స్యలు లేవనెత్తారు.