తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి.. కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. పార్టీ మారే విషయంలో మొదటి నుంచీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోన్న రేవంత్ తన రాజీనామాపైనా విమర్శలు లేకుండా చూసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్ను పంపారు. మొదట సొంత నియోజకవర్గం కొడంగల్ వెళతారని, అక్కడి కార్యకర్తలు, అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా ప్రకటిస్తారని వార్తలు వచ్చినా, వాటికి విరుద్ధంగా రేవంత్ శనివారం సాయంత్రమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించడం గమనార్హం.రెండు వారాల కిందట ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయ్యారన్న వార్త తెలిసిందే. రాహుల్.. నవంబర్ రెండో వారంలో తెలంగాణకు రానున్నారు. అదే సభలో రాహుల్ గాంధీ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక సమాచారమేదీ లేదు.