గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీకి, పార్టీ పదవులకు ఆయన రాజీనామా చేశారు. చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అమరావతిలో జరిగిన సమావేశంలో రేవంత్ కు మాట్లాడేందుకు చంద్రబాబు అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. వ్యక్తిగతంగా చంద్రబాబును కలిసేందుకు రేవంత్ ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అంతిమంగా పార్టీకి రాజీనామా చేసేందుకు రేవంత్ నిర్ణయించుకున్నారు.
టీడీపీనీ వీడుతున్న రేవంత్ చంద్రబాబుకు రాసిన లేఖలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ‘పార్టీపై, పార్టీ అధ్యక్షుడిపై నాకు ఎంతో గౌరవం ఉంది. నన్ను తక్కువ సమయంలో పార్టీ ఉన్నత పదవులను నిర్వహించేలా చేసింది. నా ఎదుగుదలకు బాబు ఎంతో కృషి చేశారు. చంద్రబాబు నాకు తండ్రితో సమానం. ఎల్లప్పుడూ పార్టీ, కార్యకర్తల శ్రేయస్సు కోరుకునే వ్యక్తిని నేను.ఏపీ, టీటీడీపీ సీనియర్లు తమ స్వార్థం కోసం ఇతర పార్టీల నేతలతో చేతులు కలిపి టీటీడీపీని నాశనం చేస్తున్నారు. నేను కేసీఆర్‌పై పోరాటం చేస్తుంటే ఏపీ, టీటీడీపీకీ చెందిన నేతలు ఆయనతో కలిసి సమావేశం నిర్వహించారు. మరికొంతమంది టీఆరెస్ ప్రభుత్వంతో లాలూచీపడి కాంట్రాక్టులు తెచ్చుకున్నారు. అలాంటప్పుడు నా పోరాటానికి విలువ ఎక్కడ ఉంటుంది? నన్ను ఇబ్బందులకు గురిచేయడం కోసం, నన్ను దెబ్బకొట్టడం కోసం కేసీఆర్ టీడీపీ నేతలకు తాయిలాలు ఇస్తున్నారు.
నేను పార్టీ సంక్షేమం కోరుకునే వ్యక్తిని, నా స్వార్థం కోసం ఎప్పుడు పార్టీని అడ్డుపెట్టుకోలేదు. టీడీఎల్పీ నేతగా ఉన్నా నాకన్నా సీనియర్ అయిన సండ్రకు అన్ని బాధ్యతలు అప్పగిస్తూ స్పీకర్‌కు గతంలో లేఖ రాశా. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు కూడా ఎక్కువ సమయం పార్టీలోని మా ఎమ్మెల్యేలకు ఇచ్చా. కేసీఆర్ నియంత పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిపించాలి.నా పోరాటం ఎప్పుడు కేసీఆర్, టీఆర్ఎస్పైనే. పార్టీ క్యాడర్‌ను చూస్తే చాలా బాధగా ఉంది. తెలంగాణలో టీడీపీ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. నేను ఈరోజు స్థాయిలో ఉండటానికి కార్యకర్తలు, బాబునే కారణం. టీడీపీ క్యాడర్ నాకు ప్రాణంతో సమానం. కొడంగల్‌లో కార్యకర్తలతో చర్చించాకే ఏదైనా నిర్ణయం..’ అని పేర్కొన్నారు.