ప్రియాంక హత్యకేసు నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియా తో మాట్లాడుతూ తన కొడుకు ఇలాంటి పని చేశాడని తెలిసి పరువు పోయిందన్న బాధతో తన భర్త ఆత్మహత్యకు యత్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లో చేధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులు.. ఏ-1 మహమ్మద్ ఆరిఫ్ (26), ఏ-2 జొల్లు శివ (20), ఏ-3 జొల్లు నవీన్ (20), ఏ-4 చింతకుంట చెన్నకేశవులు (20) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. ప్రియాంకను కిడ్నప్ చేసి లైంగికదాడికి పాల్పడి, హత్య చేయడం జరిగిందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వెల్లడించారు. ఈ క్రమంలో నిందితులను ఉరి తీయాలని లేదా ఎన్కౌంటర్ చేయాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో నిందితుడు చెన్నకేశవులు తల్లి జయమ్మ మీడియాతో మాట్లాడారు. నా కొడుకు ఇట్లా చేస్తాడని ఊహించలేదని లవ్ మ్యారేజీ చేసుకున్నప్పటికీ ఇంట్లో పళ్ళెత్తి మాటైనా అనలేదని తన కొడుక్కి కిడ్నీ పాడైందని చెప్పుకొచ్చింది. లారీ లోడ్ చేయాలని తన స్నేహితుడు తీసుకుపోయాడని ఇప్పుడు ఊరంతా మా గురించే మాట్లాడుతున్నారు. అయితే అందరికీ ఒకటే బాధ. నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు. ప్రియాంకను ఎలా చంపారో నా కొడుకును అలా చంపినా ఫర్వాలేదు. ఉరి వేయండి లేదా కాల్చి చంపండి. ఇప్పుడు నా కొడుకును ఏం చేయొద్దంటే ఎవరూ వినరు. నేను మాత్రమే తొమ్మిది నెలలు మోసి కొడుకును కనలేదు కదా. ఆ అమ్మాయి తల్లి కూడా తొమ్మిది నెలలు మోసి కన్నారని. అందరిదీ అదే బాధ’ అని ప్రియాంక మృతికి కారణమైన వాళ్లకు ఈ సమాజంలో బ్రతికే అర్హత లేదని ఆవేదన వ్యక్తం చేశారు.