జూపూడి ప్రభాకర్ తర్వాత చంద్రబాబుకు మరో టీడీపీ దళిత నేత గట్టి షాకే ఇచ్చారు.. టీడీపీ సీనియర్ నేత, ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఇవాళ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.కారెం శివాజీకి జగన్ స్వయంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కారెం శివాజీని సీఎం జగన్ వద్దకు అరకు వైసీపీ ఎంపీ మాధవి తీసుకొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగిన కార్యక్రమంలో శివాజీతో పాటు మరో 9 మంది కీలక టీడీపీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా కారం శివాజీ గురువారం నాడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ తో పాటు సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శికి ఆయన వేరువేరుగా లేఖలు పంపారు. పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఆయన వైసీపీలో చేరడం విశేషం. మాలమహానాడు అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికల తర్వాత టీడీపీలో చేరారు. 2016లో చంద్రబాబు ఆయనకు ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. గత సార్వత్రిక ఎన్నికలలో కారెం శివాజీ గుంటూరు జిల్లాలోని వేమూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు కాని బాబు టికెట్ ఇవ్వలేదు. టీడీపీ ఘోర పరాజయం తర్వాత కారెం శివాజీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడంలేదు. ముఖ్యంగా మరో కీలక దళిత నేత జూపూడి ప్రభాకర్ వైసీపీలో చేరిన తర్వాత కారెం శివాజీ కూడా ఆయన బాటలోనే టీడీపీకి గుడ్‌బై చెబుతారని..అందరూ భావించారు. ఊహించినట్లుగానే..కారెం శివాజీ తన పదవికి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కారెం శివాజీ చేరికలో గోదావరి జిల్లాలకు చెందిన ఓ సీనియర్ మంత్రి సీఎం జగన్‌తో చర్చించినట్లు సమాచారం. ఏదేమైనా వరుసగా ఇద్దరు సీనియర్ దళితనేతలు వైసీపీలో చేరడం టీడీపీకి మైనస్ అనే చెప్పాలి.
