2019 ఎన్నికలలో తీవ్ర పరాభవం మూటగట్టుకున్న టిడిపికి మనుగడను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది. ఒక్కొక్కరుగా నాయకులు వలస బాట పడుతున్నారు. తాజాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి గురువారం రాత్రి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. దేశ రాజధాని దిల్లీలో పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీనడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు కుమార్తె శబరి, తెలుగు రియాలిటీ షో బిగ్బాస్-2 విజేత కౌశల్, అనగాని సులోచన తదితరులు కూడా భాజపా కండువా కప్పుకున్నారు. బైరెడ్డి 1994-2004 మధ్య నందికొట్కూర్ అసెంబ్లీ స్థానానికి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2012లో తెదేపాతో విభేదించి రాయలసీమ పరిరక్షణ సమితిని నెలకొల్పారు కానీ ప్రజల్లో పెద్దగా ఆదరణ లభించకపోవడంతో కాంగ్రెస్ లో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు తిరిగి తెదేపాలో చేరి నందికొట్కూర్లో పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషిచేశారు కానీ ఆశించిన ఫలితం దక్కలేదు దేనితో తన క్యాడర్ ను కాపాడుకోవాలని భావించిన బైరెడ్డి భాజపా లో చేరిపోయారు.
