స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తోన్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బన్నీ, త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ మంచి విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన టాక్ ప్రకారం ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమాలో ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంటుందని, ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపిస్తారని ఇన్సైడ్ టాక్. ఏది ఏమైనా అభిమానులకు డబుల్ అల్లు అర్జున్ డబుల్ ఫన్ అన్న మాట. అయితే, ఈ ఫన్ ఎంతసేపో ఉండదని కూడా అంటున్నారు. కేవలం 5 నిమిషాలు మాత్రమే అల్లు అర్జున్ డ్యుయల్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. మొత్తం మీద ప్రేక్షకులకు త్రివిక్రమ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్నది నిజం.
సహజంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆంటే మాటల మాంత్రికుడు అని పేరు. ఆయన పంచ్ డైలాగులు, సెటైర్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. అయితే, ఈ కామెడీ డోస్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో కాస్త ఎక్కువగానే ఉంటుందట. ముఖ్యంగా అల్లు అర్జున్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాలు అయితే ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేస్తాయని అంటున్నారు. అల్లు అర్జున్, వెన్నెల కిషోర్ కాంబినేషన్ మూవీకి కాస్త కలిసొచ్చే అంశం.
బిన్నీ సరసన పూజా హెగ్డే నటించడాం అలాగే సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్రఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, రోహిణి, ఈశ్వరీరావు, కల్యాణి నటరాజన్, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, పమ్మిసాయి, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కాంబినేషన్లో అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.