అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతికి ఎందుకు వస్తున్నారు..ఏముంది ఇక్కడ స్మశానం తప్పా..అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే అమరావతిలో ఏమి లేదనే అర్థం తప్పా..స్మశానం అన్నందుకు పెడార్థం తీయద్దని మంత్రి బొత్స మీడియాను కూడా కోరారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆంధ్రులకు సెంటిమెంట్‌గా మారిన రాజధాని అమరావతిని స్మశానంతో పోల్చి అవమానించిన బొత్సను వెంటనే బర్త్‌రఫ్ చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. యనమల విమర్శలకు స్పందించిన బొత్స మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధానిలో ఏమి చూడటానికి చంద్రబాబు వస్తున్నారని ప్రశ్నించారు. 5 ఏళ్లలో అమరావతికి చంద్రబాబు వల్ల జరిగిన నష్టం 20 ఏళ్లలో కూడా పూడదన్నారు. రైతుల భూములు లాక్కోవడమే కాదు..రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర చంద్రబాబుదని బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో 5 వేల కోట్లు ఖర్చుపెట్టి రెండు, మూడు తాత్కాలికభవనాలే తప్ప..శాశ్వత నిర్మాణాలు ఎందుకు జరగలేదని ఆయన ప్రశ్నించారు. అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్్తో చంద్రబాబు, టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారని.. బొత్స ఆరోపించారు. తనను బర్తరఫ్ చేయాలన్న యనమల వ్యాఖ్యలపై స్పందించిన బొత్స ..యనమల రామకృష్ణుడులా తాను దోచుకోలేదని బర్తరఫ్ చేయాలా? అని ప్రశ్నించారు. కొన్ని పచ్చ పత్రికలు తమపై ఇష్టానుసారంగా రాస్తున్నాయని మంత్రి బొత్స మండిపడ్డారు. వేల కోట్ల రూపాయలు అప్పు చేసి రాజధానిలో ఏం సంపద సృష్టించారని ప్రశ్నించారు. ప్రభుత్వ అసమర్థత వల్లే అమరావతి నుంచి సింగపూర్ కంపెనీలు వెనక్కి వెళ్లాయన్న చంద్రబాబు విమర్శలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. సింగపూర్ కన్సార్టియంతో బాబు చేసుకున్న ఒప్పందం లోపభూయిష్టమని, కేవలం 350 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీకి రూ. 5 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పించడం ఏంటని మంత్రి నిలదీశారు. పరస్పర అంగీకారంతోనే సింగపూర్ కన్సార్టియం తప్పుకుందని బొత్స చెప్పారు. మొత్తంగా అమరావతి విషయంలో తనపై విమర్శలు చేస్తున్న టీడీపీ నేతలకు మంత్రి బొత్స ధీటుగా బదులిచ్చారు.
