ఇంగ్లిష్ మాధ్యమం విషయంలో చంద్రబాబుకు ఆలస్యంగా జ్ఞానోదయం కల్గిందని, ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తటంతో భయపడి ఉన్నపళంగా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని రాష్ట్ర సమాచార, ప్రసార, రవాణా శాఖల మంత్రి పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ల జీవితాలు అన్నింట్లోనూ యూటర్న్‌లేనని ఎద్దేవా చేశారు. ఇంగ్లిషు మాధ్యమం విషయంలో ఆలస్యంగానైనా వారు వాస్తవాలు తెలుసుకున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తానని హెచ్చరించిన బాబు ఇప్పుడు యూటర్న్ తీసుకున్నాడని తెలిపారు. గతంలో బీజేపీతో పొత్తుల విషయంలో పలుమార్లు యూటర్న్లు తీసుకొని చంద్రబాబు రికార్డు సాధించారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ, మళ్లీ ప్రత్యేక హోదా ఇలా రోజుకొక నిర్ణయం తీసుకున్న బాబుకి ఏ విషయంలోనూ స్పష్టతలేదన్నారు.