ఏ అంశమైనా..ఎంత సేపైనా..ఎన్నిరోజులైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడం సరికాదన్నారు. అందరు సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి హరీష్ తెలిపారు.కాంగ్రెస్ నేతలు చర్చ కంటే.. రచ్చకే సిద్ధంగా ఉన్నారని ఇవాళ మరోసారి రుజువైందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. సభ కేవలం ఒక కాంగ్రెస్ పార్టీదే కాదన్నారు. సభలో ఎన్ని రోజులైనా.. ఏ అంశంపైనైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పినప్పటికీ ఆందోళనకు దిగడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. చర్చ కంటే రచ్చ మీదే కాంగ్రెస్ మనసు పెట్టిందని విమర్శించారు. జానారెడ్డి సభలో మాట్లాడటం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు. ఆ పార్టీ నేతలకు మాట్లాడేందుకు సబ్జెక్ట్ లేదని మంత్రి అన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటిని కాంగ్రెస్ నేతలు అక్రమంగా మళ్లించారని తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని మంత్రి స్పష్టం చేశారు.
