తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీళ్లు ఇచ్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. కేవలం మూడు ఏండ్లలోనే కాళేశ్వరాన్ని నిర్మించి యావత్ దేశాన్ని తెలంగాణ వైపు తిప్పుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో కాళేశ్వర జలాలు మానేరు దిశగా పరుగులెడుతున్నాయి.
ప్రాజెక్టుకు సంబంధించిన నంది,గాయత్రి పంపు హౌస్ లలో ఆరు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు జరుగుతున్నాయి. ఎల్లంపల్లి జలశయం నుంచి నిన్న శుక్రవారం సొరంగాల ద్వారా వచ్చిన నీళ్లను పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం దగ్గర నంది పంప్ హౌస్ లో ఉన్న 2,3,4,5,6,7 వ మోటర్ల ద్వారా నీళ్లను ఎత్తిపోస్తున్నారు. అక్కడ నుంచి నంది రిజర్వాయర్ కు చేరిన నీళ్లను దాదాపు ఇరవై కిలోమీటర్ల జంట సొరంగాల ద్వారా కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రీ పంపు హౌస్ లోని సర్జ్ పుల్ కు చేరుకుంటున్నాయి.
అక్కడ నుండి 1,2,3,4,6,7వ పంపుల ద్వారా వస్తున్న నీళ్లను గ్రావిటీ కాలువ ద్వారా నిండుగా ప్రవహించి శ్రీరాములపల్లి శివారులోని వరదకాలువతో కలిసి ఎస్సారార్ రిజర్వాయర్ కు చేరుకుంటున్నాయి. నిన్న శుక్రవారం సాయంత్రం ఆరు గంటల వరకు 20,959 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. డ్యాం లో నీటి నిల్వ 6.77టీఎంసీలు ఉండగా మూడు రోజుల్లో మరో 4టీఎంసీలు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.