తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ, మార్క్‌ఫెడ్, విత్తనాభివృద్ధి సంస్థ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది పంట దిగుబడి బాగా వస్తుంది. రైతులకు సరైన మద్దతు ధర చెల్లించి పంటను కొనుగోలు చేయాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. ఈ సందర్భంగా మంత్రి విత్తనాభివృద్ధి అధికారులకు కొన్ని సూచనలు చేశారు. రబీ పంట నిమిత్తం శనగ విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపిన మంత్రి.. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో వరి సాగు విస్తీర్ణం అధికంగా పెరిగే అవకాశం ఉందన్నారు. పొద్దు తిరుగుడు, కుసుమ పంటలను వేసేలా రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు సూచించారు. రబీ సీజన్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 15 నాటికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉంచాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులకు తెలిపారు.