బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజుల్లో బంగ్లాదేశ్‌తో ఇండోర్‌లో జరుగనున్న తొలి టెస్టుకు టీమిండియా సిద్ధమవుతుండగా జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి కొంతమంది పిల్లలతో సరదాగా గడిపాడు. ఆ పిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడుతూ మురిసిపోయాడు. తన బాల్యపు ఛాయల్ని గుర్తు చేసుకుంటూ పిల్లలతో కలిసి క్రికెట్‌ను ఆస్వాదించాడు. అదే సమయంలో షాట్లు కొట్టి మరీ అలరించాడు. మరొకవైపు పిల్లలతో కలిసి పరుగులు పెట్టాడు. తర్వాత పిల్లలకు బౌలింగ్ కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మొదటి టెస్టు గురువారం ఇండోర్‌లో ఆరంభం కానుండగా, రెండో టెస్టు నవంబర్22వ తేదీన ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్లో జరుగనున్న రెండో టెస్టును డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించనున్నారు.