కాంట్రవర్సీ కామెంట్లతో పాపులర్ అయిన టీడీపీ అధికార ప్రతినిధి యామిని సాధినేని ఇవాళ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పార్టీలో చేరిన అనతికాలంలోనే చంద్రబాబుకు, లోకేష్‌లకు అత్యంత సన్నిహితంగా మారిన యామిని టీడీపీలో ఓ వెలుగు వెలిగింది. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీ తరపున వాయిస్ బలంగా వినిపించిన మహిళా నేతల్లో యామిని ముందువరుసలో ఉంటారు. టీవీ చర్చల్లో ప్రత్యర్థులపై యామిని తీవ్ర పదజాలంతో విరుచుకుపడేవారు. నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై అయితే హద్దులు మీరి విమర్శలు చేసేవారు. అంతే కాదు స్వయంగా సోషల్ మీడియాలో జగన్, కేసీఆర్, మోదీలపై తీవ్ర విమర్శలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేసేది. సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులపై యామిని చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారేవి. ముఖ్యంగా పవన్ కల్యాణ్ మల్లెలు నలుపుతాడంటూ..ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు ఆమెపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. కాగా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ కోసం యామిని తీవ్రంగా ప్రయత్నించింది. టికెట్ తనకు కేటాయించాలంటూ తన వర్గంవారిని యామిని రెచ్చగొడుతున్నట్లు ఓ ఆడియో సంభాషణ ఒకటి ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. అయితే చంద్రబాబు మాత్రం యామినికి టికెట్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చాడు. బాబుగారి వాడుకుని వదిలేసే బుద్ధిని గ్రహించిన యామిని..క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరమైంది. ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలవడంతో యామిని పూర్తిగా సైలెంట్ అయింది. అంతే కాదు..ఎన్నికల ఫలితాల తర్వాత యామిని స్వయంగా బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసింది. దీంతో యామిని బీజేపీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చినా ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. అయితే తాజాగా యామిని సాధినేని టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మరి యామిని తదుపరి స్టెప్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. వల్లభనేని వంశీ బాటలో వైసీపీలో చేరుతుందా..లేకుంటే..బీజేపీలో చేరుతుందా అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే యామిని బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె సన్నిహితులు అంటున్నారు. మొత్తంగా ఫైర్ బ్రాండ్‌గా ఎదిగిన యామిని సాధినేని రాజీనామా చేయడం టీడీపీలో కలకలం రేపుతోంది.