అవును..వట్టి కోట ఆళ్వారు స్వామి ..నిజమైన ప్రజల మనిషి..తన జీవితాన్ని తెలంగాణ ప్రజల కోసం అంకితం ఇచ్చిన అచ్చ తెలంగాణ మట్టిబిడ్డ.. వట్టికోట ఆళ్వారు స్వామి..పౌరుషాల గడ్డ, ఉద్యమాల ఖిల్లా నల్గొండ జిల్లాలోని నకిరేకల్ సమీపంలోని చెరువు మాదారం గ్రామంలో రామచంద్రాచార్యులు, సింహోదమ్మ దంపతులకు జన్మించారు. వట్టికోట బాల్యమంతా ఒడిదుడుకులతోనే సాగింది. చిన్ననాడే తండ్రిని కోల్పోయిన ఆయన ఉపాధ్యాయుడైన సీతారామారావు గారికి వంట చేస్తూ జీవనం సాగించేవారు. సూర్యాపేట గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకుంటూ ప్రపంచాన్ని తెల్సుకున్నారు. ఇలా చిన్ననాటి నుండే పుస్తకాలపై మక్కువ చూపించే ఆళ్వారు స్వామి అనతి కాలంలోనే హిందీ, ఉర్దూ, తెలుగు భాషలపై పట్టు సాధించారు.
వట్టికోట ఆళ్వారు స్వామి జీవించడానికి అనేక పనులు చేశారు. ఇళ్లల్లో వంటలు చేస్తూ పూట గడిపేవారు. విజయవాడలో ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ బతికేవారు. తిరిగి హైదరాబాద్ వచ్చి సురవరం స్థాపించిన గోల్కొండ పత్రికలో 1936-37 వరకూ ప్రూఫ్ రీడర్‌గా, తెలుగు తల్లి పత్రికా నిర్వాహకుడిగా ప్రజా సాహిత్య ప్రచురుణకర్తగానే కాకుండా మీజాన్ పత్రికలో కూడా తన ప్రస్థానం ప్రారంభించారు. 1938లో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి సుమారు 35 పుస్తకాలను ప్రచురించారు. మహానుభావుల రచనలు ముద్రించి ఊరూరా పుస్తకాలు బుట్టలో పెట్టుకుని వాటిని పరిచయం చేస్తూ, విక్రయిస్తూ సాహిత్యాన్ని అభివృద్ధి చేశారు. సురవరం గారి ‘హైందవ ధర్మ వీరులు’, ‘ప్రాథమిక సత్యము’లే కాక కాళోజీ ‘నాగొడవ’ సురవరం కూడా మొదట దేశోద్ధారక గ్రంథమాల నుండే వెలువడటం విశేషం.
1940-45ల మధ్య సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని వర్ణిస్తూ ‘గంగు’నవలను, జైలు జీవితాన్ని, జైలు సంస్కరణలను, ఖైదీల విభిన్న మనస్తత్వాలను తెలుపుతూ ‘జైలు లోపల’ కథల సంపుటి రాశారు. కాళోజీ ‘నాగొడవ’ కావ్యం స్ఫూర్తితో సామాజిక సమస్యలు తెలిపే ‘రామప్ప రభస’ వ్యాసాలు రాశారు. మిజాన్ పత్రికలో కడివెండి కాల్పులపై గజ్వేల్ సంస్థానంలోని అన్యాయాలను వ్యక్త పరుస్తూ వ్యాసాలు, వార్తలు రాశారు. గ్రంథాలయోద్యమాల్లో, తెలంగాణ రచయితల ఉద్యమాల్లో, దేశోద్ధారక పనుల్లో వట్టికోట చేసిన కృషి అనిర్వచనీయం.
1942లో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో హైదరాబాద్‌లో జరిగిన సత్యాగ్రహం కార్యక్రమంలో కాంగ్రెస్‌వాదిగా పాల్గొన్న వట్టికోట నిజాం నవాబు ఆగ్రహానికి గురై, సికింద్రాబాద్‌లో ఏడాదిపాటు జైలు జీవితం గడిపారు. ఆ తరువాత ఆంధ్రమహాసభ ద్వారా క్రియాశీలకంగా పనిచేశారు. ఆర్గనైజర్‌గా, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. 1944లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన వట్టికోట. ఒక చేత పెన్ను, మరో చేత గన్ను పట్టారు. ప్రజల తరఫున నిలిచారు. అభ్యుదయ రచయితల సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. నిజాం ప్రధాని మీర్జా ఇస్మాయిల్ హయాంలో ఉద్యమకారులు, రచయితలపై నిర్బంధం పెరిగింది. ఆళ్వారుస్వామిని అరెస్టు చేసి… సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్, వరంగల్ జైళ్లకు తిప్పారు. తన జైలు జీవితాన్ని, సొంత అనుభవాలను క్రోడీకరిస్తూ..వట్టికోట ” జైలు లోపల” అనే పుస్తకం రాశారు.
నిజాం రాజ్యంలో నిర్బంధకాండను అక్షరబద్దం చేస్తూ “ప్రజల మనిషి” అనే నవలను రాశారు. ఆ నవలలోని కంఠీరవం పాత్ర వట్టికోట జీవితాన్ని స్పురణకు తెస్తుంది. తొలి తెలంగాణ నవల ‘ప్రజల మనిషి’. ఈనవలకు పూర్వం కొన్ని నవలలు పుట్టాయి. . కానీ ప్రజల మనిషి నవలను చాలా వరకు తెలంగాణలో మొదటి నవలగా తీసుకుంటారు. ఆనాటి ప్రజల ఆలోచనలు, విధానాలు, సాంఘిక, ఆర్థిక పరిస్థితులను కొట్టొచ్చినట్లు చూపించే రచన ‘ప్రజల మనిషి’ నవల. ఇక గిర్దావర్ అనే పుస్తకంలో నాటి భూస్వాముల అరాచకాలను రాశారు. పరిసరాలు అనే పుస్తకం ద్వారా ముస్లింల జీవన వ్యథలను రాశారు.
1948లో అరెస్టయిన ఆళ్వారు స్వామి దాశరథి వెంట 3నెలల జైలు జీవితాన్ని గడిపారు. ఆ సమయంలో నిజాం రాజుపై నిరంకుశ పాలనపై దాశరథి రాసిన పద్యాలను ఆళ్వారు స్వామి కంఠస్తం చేసే వారు. జైలు గోడలపై బొగ్గుతో ఆ పద్యాలు రాసేవారు. అనంతరం ప్రజల్లోకి ఆ పద్యాలు చెప్పుకుంటూ ప్రజలను చైతన్య పర్చేవారు. అది గమనించిన దాశరథి తన ‘అగ్నిధార’ కావ్యాన్ని ఆళ్వారు స్వామికి అంకితం చేశారు. అంతటి గొప్ప అవకాశం ఆళ్వారుకే దక్కింది. సికింద్రాబాద్ ప్రాంతంతోనూ ఆయనకు అనుబంధం ఉంది. అక్కడి యువకులను చేరదీసి చైతన్యం కల్పించారు.. సామాజిక సమస్యలపై స్పందించేలా చేశారు. కేవలం 46 ఏళ్ల వయసులో డిప్తీరియా వ్యాధితో చనిపోయిన ఆళ్వారు స్వామి తెలంగాణ నేటి తరానికి అనుక్షణం స్ఫూర్తి కణం.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మట్టిబిడ్డ వట్టికోట ఆళ్వారు స్వామి చరిత్ర వెలుగులోకి వచ్చింది..వట్టికోట సాహితీ ప్రపంచానికి ఓ రకంగా కాళోజీ, దాశరథితో సరిసమానం అని చెప్పవచ్చు.. ఆయన తెలంగాణ సమాజానికి చేసిన సాహితీ సేవ, ఆయన అందించిన పోరాట స్ఫూర్తి తెలంగాణ ప్రజలను చైతన్య పరిచింది. తెలంగాణ నేల ఉన్నంతకాలం వట్టికోట ఆళ్వారుస్వామి పీడిత, తాడిత ప్రజల హృదయాలలో కొలువై ఉంటారు.నేడు ఆయన జయంతి సందర్భంగా ఆ నిజమైన ప్రజల మనిషి, తెలంగాణ మట్టి బిడ్డకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తుంది మా దరువు.కామ్.