ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు.
సాధారణంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న భారత సంతతికిచెందిన వారిని ఎన్ఆర్‌ఐలు అంటారని.. కానీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్ఆర్ఏలని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్ ఆర్ ఏ అంటే నాన్ రెసిడెన్స్ ఆంధ్రులని, ఆంధ్రాలో ప్రజాప్రతినిధులుగా గెలిచి హైదరాబాద్ లో ఉంటారని వీరందరూ మాకు నీతులు చెబుతారని ఎద్దేవా చేశారు .
పల్లెటూరుకు సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్లేనని, ఆ అవకాశం తనకు చిన్న వయస్సులోనే వచ్చిందని ఆయన అన్నారు .మొత్తం పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని ఆయనకు అందరూ సహకరించాలని మంత్రి లోకేష్ సూచించారు. డ్వాక్రా మహిళలకు ఆరు వేల రూపాయల రుణమాఫీ చేశామని.. మరో నాలుగు వేల రూపాయల రుణమాఫీ చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.