జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుల్లో ఒకరు రాజు రవితేజ. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా వెనుక ఎవరూ లేరు ఒక్క రాజు రవితేజ్ తప్ప అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడంతో అతడి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారు మ్రోగిపోయింది. సమాజంలోని వివిధ అంశాల పట్ల రాజు రవితేజకు పవన్ కల్యాణ్ కు ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయని., అందుకే వీరిద్దరి అంత సన్నిహితులయ్యారని అప్పట్లో రాజకీయ వర్గాల్లో ప్రచారం జరగింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ రాజురవితేజ పవన్‌కు దూరమయ్యాడు. వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందనే విషయం పవన్ కల్యాణ్ సన్నిహితులకు కూడా తెలియలేదు. ఇద్దరు మేథావుల మధ్య ఏం గొడవలు వచ్చాయో అంటూ.. అప్పట్లో కొంతమంది పవన్ కల్యాణ్, రాజు రవితేజల గురించి జోకులు కూడా వేసుకున్నారు.
కట్ చేస్తే ఈ మధ్యన ఇటీవల రాజు రవితేజను మళ్లీ పవన్ కల్యాణ్ పిలిపించుకుని మాట్లాడారట. 2019 ఎన్నికల దిశగా జనసేనను సిద్ధం చేసే పనిలో పడ్డ పవన్ కళ్యాణ్.. రాజు రవితేజను మళ్లీ దగ్గరకు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే, పవన్‌తో కలిసి మళ్లీ కనిపించసాగాడు రాజు రవితేజ. ఇటీవల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన జనసేన కార్యవర్గ సమావేశంలో రవితేజ కనిపించాడు. బ్లాక్ షర్ట్ వేసుకొని పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చున్నాడు. ఈ సమావేశంలో రాజు రవితేజను పవన్ కల్యాణ్ తన ప్రక్కనే కూర్చోబెట్టుకోవడాన్ని బట్టి పవన్ కల్యాణ్ అతడికిస్తున్న ప్రాధాన్యత గురించి అర్థం చేసుకోవచ్చు. అలాగే, జనసేన పార్టీ ఆఫీస్‌లో ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా అతడు మెరిశాడు. ఈ నేపథ్యంలోనే, రాజు రవితేజ కు పవన్ కల్యాణ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. పవన్ కల్యాణ్ తర్వాత జనసేనలో అత్యంత కీలకమైన వ్యక్తి ఆయనేనని.. గత కొన్ని రోజులుగా పార్టీ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో ఆయనను సంప్రదించిన తర్వాతే పవన్ కల్యాణ్ తుది నిర్ణయం తీసుకుంటున్నారని జనసేన వర్గాలు ఆఫ్ ది రికార్డ్ చెబుతున్నాయి. ఈ లెక్కన చూస్తే, జనసేనలో పవన్ కల్యాణ్ తర్వాత రాజు రవితేజే కీలకం అని.. ప్రస్తుతం జనసేనలో నెం.2 స్థానం ఆయనదేనని సర్వత్రా చర్చించుకుంటున్నారు.