తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతలు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని మమ్మురం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ” హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రజలను నమ్ముకుంటుంటే ,కాంగ్రెస్ పార్టీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం అక్రమంగా అవినీతిగా సంపాదించిన డబ్బులను నమ్ముకుంటున్నాడు “అని ఆయన ఆరోపించారు.
గత ఆరేళ్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను చూసి హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రినంటూ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలను నమ్మించి మోసం చేసి గెలిచాడు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో తానే కేంద్ర మంత్రినంటూ మరోసారి మోసంతో గెలిచారు. ఈ సారి మాత్రం ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కర్నె ప్రభాకర్ హుజూర్ నగర్ ప్రజలకు పిలుపునిచ్చారు.