హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రలో భాగంగా అక్టోబర్ 13 , ఆదివారం నాడు భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా కాళేశ్వరం వద్ద గోదావరి నదీమ తల్లికి పసుపుకుంకుమ, చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని దర్శించుకుని కాళేశ్వరుడికి, ముక్తేశ్వరుడికి పూజలు చేశారు. ఆ తరువాత కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన కన్నెపల్లి లక్ష్మీ పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌లను సందర్శించారు. స్వామివారికి కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి ఘనస్వాగతం పలికారు. మేడిగడ్డ బరాజ్‌ను, వ్యూ పాయింట్ వద్ద మ్యాప్ ద్వారా లక్ష్మీ పంప్‌హౌస్ పనితీరును స్వామిజీ పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ స్వాత్మానందేంద్ర మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టును అనతికాలంలోనే పూర్తిచేసిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భగీరథ ప్రయత్నానికి భగవంతుడి ఆశీస్సులు కూడా తోడయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టుతో యావత్ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని స్వామిజీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలంగా ఉంచాలని గోదావరి తల్లిని ప్రార్థించానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ రమణారెడ్డి, ఇతర అధికారులు, హిందూ ధర్మ ప్రచారయాత్ర తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమన్వయకర్త గడిచర్ల శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.