రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తుందని వార్తలు వచ్చాయి. కాగా, ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడం లేదని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మంత్రి పువ్వాడ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీని కాపాడుకుంటామని.. ప్రైవేటుపరం చేయమని స్పష్టం చేశారు. మంత్రి పువ్వాడ మాట్లాడుతూ..’ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ పార్టీ ఏనాడూ చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాయా? తెలంగాణలో ఆందోళనలు చేస్తున్న బీజేపీ నాయకులు, కేంద్రం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను గమనించటంలేదు. రైల్వేలో ప్రైవేటీకరణ విధానం బీజేపీ రాష్ట్ర నేతలకు కనిపించటం లేదా? సమ్మెతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను విపక్షాలు సమర్థిస్తున్నాయా? సమ్మెను ప్రయాణీకులు, ప్రభుత్వంపై బలవంతంగా రుద్దారన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం 7358 వాహనాలను నడుపుతోంది. బస్సులను నడిపించేందుకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తున్నాం “అని అన్నారు.
