విశాఖ పశ్చిమనియోజక వర్గపర్యటనలో భాగంగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గం ఐటీఐ జంక్షన్ వద్ద రూ. 60లక్షల వ్యయముతో డ్రైనేజీలు, సీసీరోడ్ల నిర్మాణం, స్మశాన వాటికలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రానున్న సంస్థాగత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని.. భారీ మెజార్టీ సాధించి ముఖ్యమంత్రికి బహుమతిగా ఇస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. దివంగత మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టారని గుర్తుచేశారు. అవినీతికి తావులేకుండా లక్షన్నర ఉద్యోగాలు అందించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు.
