తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. గడచిన ఏడు రోజులుగా రోజుకో వాహనంపై స్వామివారు ఉత్సవమూర్తి అయిన మలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. 8 వ రోజైన ఈ రోజు ఉదయం మలయప్పస్వామి మహారథంపై ఊరేగారు. ఈ రాత్రి స్వామివారు అశ్వ వాహన సేవలో దుష్ట శిక్షకునిగా కల్కి అవతారంలో దర్శనమిస్తారు. ఈ వాహనంపై స్వామి వారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో, విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధుల్లో ఊరేగుతారు. కలియుగాంతంలో దుష్టశిక్షణ… శిష్టరక్షణ చేసి ధర్మాన్ని పునఃప్రతిష్ట చేసే కల్కిమూర్తి రూపం నిజంగా అపురూపం.ఈ అశ్వవాహన సేవతో స్వామివారి సేవలు ముగుస్తాయి. రేపు అక్టోబర్ 8న స్వామివారికి చక్రస్నానం కార్యక్రమం ఉంటుంది. తదనంతరం ధ్వజావరోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.