తెలంగాణ రాష్ట్రంలో గత రెండు రోజులుగా సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బంది తీరుపై ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలా సీరియస్ గా ఉన్న సంగతి విదితమే. నిన్న ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో భాగంగా సమ్మెలో పాల్గొనని పన్నెండు వందల సిబ్బందిని తప్పా మిగతావారిని ఎవర్నీ తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతే కాకుండా యూనియన్ల నాయకులతో చర్చలు కూడా జరపము. రానున్న కాలంలో ఆర్టీసీ భవిష్యత్ కోసం పలు కీలక చర్యలు చేపడతామని తేల్చి చెప్పారు.
దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ” సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వం తొలగిస్తే ప్రజలే సర్కారును కూల్చేస్తారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని”సూచించారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని కార్మికుల చేత సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలి. కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని లక్ష్మణ్ హితవు పలికారు.