`ఉమ్మడి ఏపీలో ఆర్టీసీకి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కేవలం రూ.1695కోట్లు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి ప్రభుత్వం రూ.3303 కోట్లు ఇచ్చింది. తెలంగాణలో దసరా చాలా పెద్ద పండుగ. పండుగ వేళ ప్రజలు ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం` అని ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదన వచ్చినప్పటికీ…ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళుతున్న నేపథ్యంలో…ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది.
అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం మొత్తం పదివేల ఆర్టీసీ బస్సులు ఉంటే… వాటిలో 2,500 బస్సులు అద్దెకు తీసుకున్నారు. కనుక ఈ అద్దె బస్సులు కచ్చితంగా తిరుగుతాయి. మిగిలిన 7500 బస్సుల్లో రోజుకు రెండువేల బస్సులను నడిపించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా, తాత్కాలికంగా రెండువేలమంది నిపుణులైన డ్రైవర్లు, తగిన సంఖ్యలో కండక్టర్లను నియమించనున్నారు. డ్రైవింగ్‌లో కనీసం ఏడాదిన్నర అనుభవంతోపాటు హెవీవెహికిల్ డ్రైవింగ్‌లైసెన్స్ కలిగినవారిని తాత్కాలికడ్రైవర్లుగా నియమిస్తామని, అలాంటివారు ఆర్టీవో కార్యాలయాల్లో దరఖాస్తుచేసుకోవచ్చని రవాణాశాఖ ఉన్నతాధికారులు సూచించారు.
ఒక్కో డ్రైవర్‌కు రోజు కు రూ.1500 చొప్పున భత్యం చెల్లించనున్నారు. పదోతరగతి ఉత్తీర్ణులైనవారిని వారి టెన్త్ మెమోను జామీనుగా పెట్టుకుని తాత్కాలిక కండక్టర్లుగా నియమించనున్నారు. వీరికి రోజుకు రూ.1000 చొప్పున చెల్లించనున్నారు. ఆర్టీసీ రిటైర్డ్ సూపర్‌వైజర్లు, క్లర్కులు, మెకానిక్కులను కూడా తాత్కాలిక విధులకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వీరికి కూడా భత్యం చెల్లిస్తారు. ఈ మేరకు వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకునే సందర్భాల్లో ఇటువంటివారికి ప్రాధాన్యం ఇస్తామని అధికారులు చెప్తున్నారు