విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి హిందూ ధర్మ ప్రచార యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో భక్తుల నీరాజనాల మధ్య దిగ్విజయవంతంగా సాగి పోతుంది.
ఐదవ రోజైన గురువారం నాడు స్వామివారు సుప్రసిద్ధ కొత్తకొండ శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని సందర్శించిన శ్రీ స్వాత్మానందేంద్రకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో వీరభద్రుడికి స్వామివారు స్వయంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ రాకను సూచించేలా, భవిష్యత్ కాలాలకు గుర్తు ఉండిపోయేలా ఆలయ ప్రాంగణంలో పవిత్రమైన ” రుద్రాక్ష మొక్కని ” స్వయంగా స్వామివారు నాటారు. తదనతరం భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానులేనని, హిందూ ధర్మాన్ని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సందేశం ఇచ్చారు. అలాగే కొత్తకొండలో అనంతుల సత్యనారాయణ ఇంటికి వెళ్లి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొత్త కొండ నుంచి కొప్పూర్ గ్రామానికి వెళ్లి అక్కడ గద్దల బండ పంచముఖ ఆంజనేయ స్వామిని స్వామివారు సందర్శించారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారయాత్ర కన్వీనర్, దరువు ఎండీ సీహెచ్ కరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.