వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్‌కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, గతంలో చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదని, పచ్చచొక్కా వేస్తేనే అభివృద్ధి అన్నట్లు పనిచేశారని విమర్శించారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ గాంధీ 150వ జయంతి స్పూర్తితో ముఖ్యమంత్రి సచివాలయాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జగన్ పాలనలో సచివాలయ వ్యవస్థ మైలురాయిగా నిలిచిపోతుందని, గతంలో జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తేనే పని జరిగేదని, ఇపుడు అవినీతి, లంచాలు లేకుండా ప్రజలకు సచివాలయాలు సేవలందిస్తాయన్నారు. 4వేలమందికి ఒక సచివాలయం ఏర్పాటుచేయగా ఇవి ప్రజలకు జవాబుదారీగా ఉంటాయన్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల కష్టాలను తెలుసుకున్నారన్నారు. దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదివించారని, ప్రస్తుతం ఆయన తనయుడు జగన్ ఉపాధి కల్పించారని సంతోషించారు.