గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమం విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసు తదితరులు హాజరయ్యారు. జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి కొందరికి నియామక పత్రాలిచ్చారు. అవినీతికి తావులేకుండా గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరిగాయని సీఎం అన్నారు. సేవాభావంతో పనిచేయాలని కోరారు. ఉద్యోగాల చరిత్రలో ఇది సరికొత్త రికార్డు అని సగర్వంగా చెబుతున్నానన్నారు. నాలుగు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు.
దాదాపు లక్షన్నర శాశ్వత ఉద్యోగాలిచ్చామని తెలిపారు. గ్రామ వలంటీర్లతో సచివాలయ ఉద్యోగులు సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయవద్దని, సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని కోరారు. ఉద్యోగులు నిజాయతీగా, లంచాలు తీసుకోకుండా పని చేయాలన్నారు. తాను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సీఎం జగన్ కోరారు. నా 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో నేను చూశా 1 జిల్లాల్లో తిరిగా. అక్కడ పరిస్థితులు చూశా. గ్రామమంటే నిజంగా ఎవరికైనా ప్రేమే మక్కువే. ఆ మక్కువ, ఆ ప్రేమ చివరికి అమెరికా వెళ్లినా , యూరోప్ వెళ్లినా స్వంత ఊరిని మరిచిపోరు. స్వంత తల్లిని మరిచిపోరు. అక్కడివాళ్లు కూడా ఆ ఊరికేదో మేలు చేయాలని ఆలోచన చేస్తుంటారు. అటువంటి బహత్తర బాధ్యత మీ అందరి భుజస్కందాలపైన ఉందని చెబుతున్నానన్నారు.