టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల అనుమానాస్పద మృతి కేసు పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈకేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు. కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డ వైరును స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం 8:30కి కోడెల ఫోన్ నుండి చివరి కాల్ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.
గత రెండ్రోజులు కోడెల ఎవరెవరికి ఫోన్ చేశారు.. ఎవరినుంచి ఆయనకు కాల్స్ వచ్చాయనేదానిపై దృష్టి సారించారు. కోడెల నివాసంలో వేలి ముద్రలు కూడా క్లూస్ టీమ్ సేకరించింది. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసులో పురోగతి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల స్టేట్ మెంట్ లిఖితపూర్వకంగా నమోదు చేశామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కోడెల భౌతిక కాయానికి గుంటూరు జిల్లా నరసరావుపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మరోవైపు కోడెల కుమారుడు శివరామ్ విదేశాల నుంచి గుంటూరు చేరుకున్నారు.