కర్నూలు జిల్లా మహానంది పుణ్యక్షేత్రం ఎప్పుడూ లేని విధంగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి బయట ఉన్న రెండు కోనేర్లతో సహా ఆ ప్రాంతమంతా మునిగిపోయి లోపలి కోనేటిలోకి వరదనీరు చేరింది. దీంతో రుద్రగుండం పుష్కరిణిలో ఉన్న పంచలింగాలపైకి నాలుగు అడుగుల ఎత్తు మేర నీరు చేరింది. ఇది మహానంది క్షేత్ర చరిత్రలోనే ప్రప్రథమం అని స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులెవ్వరూ స్వామి వారి దర్శనం చేసుకోలేకపోయారు.
ప్రధాన అర్చకులు అర్జునశర్మ నీటిలోనే ఆలయం లోపలికి వెళ్లి మహానందీశ్వరస్వామి, కామేశ్వరి అమ్మవార్లకు అభిషేకార్చనలు చేశారు. క్షేత్రంలో నీరు మోకాళ్ల ఎత్తుకు పైగా ప్రవహించడంతో పరిసరాల్లో కూడా భక్తులు నిలవడానికి వీలులేకుండా పోయింది. ఇదేవిధంగా రాళ్లవాగు, నల్లమల అడవి నుంచి వచ్చే పాలేరు వారు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మహానంది-నంద్యాల, మహానంది-ఒంగోలు జాతీయ రహదారికి మధ్య రాకాపోకలు నిలిచిపోయాయి.