ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అనుమానస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. కోడెల గుండెపోటుతో మరణించలేదు..ఆత్మహత్య చేసుకున్నారంటూ…ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అంటున్నారు. వైసీపీ సర్కార్ కేసులతో వేధించడం వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు కోడెల ఇంటికి వెళ్లి..ఆయన కుటుంబ సభ్యులను గన్మెన్, డ్రైవర్ను విచారించారు. ఈ సందర్భంగా కోడెల మృతిపై 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాసరావు ప్రకటించారు. కోడెలది అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశామన్నారు. అయితే కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం కోడెల మృతిపై బంజారాహిల్స్ ఏసీపీ ఆధ్వర్యంలో కేసు విచారణ జరుగుతోందని డీసీపీ తెలిపారు. కాగా కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పోస్ట్మార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని డీసీపీ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కాగా కోడెల మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ ఆయన నివాసంలో ఆధారాలను సేకరిస్తోంది. అయితే కోడెల గదిలో ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు. కాసేపట్లో పోస్ట్మార్టం రిపోర్ట్ అనంతరం కోడెల మరణంపై నెలకొన్న అనుమానాలు నివృతి అయ్యే అవకాశం ఉంది.