జగన్ 100 రోజుల పాలనపై శనివారం నాటి ప్రెస్మీట్లో జనసేన అధ్యక్షుడు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జనసేనాని ఆరోపణలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా వైసీసీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. పార్టీ అధ్యక్షుడిగా పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్…వైసీపీ ప్రభుత్వం వచ్చి 100 రోజులు కూడా కాకముందే సీఎం జగన్ ను విమర్శించాలని తపన పడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 150 సీట్లు సాధించి, 100 రోజుల్లోనే ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టి ముందుకు వెళుతుంటే..పవన్ కల్యాణ్ మాత్రం తలాతోకా లేని..ఒక 30 పేజీల స్క్రిప్ట్‌ని చదివి వినిపించారని అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ పూర్తిగా చంద్రబాబుకు అమ్ముడు పోయాడని ఆయన మండిపడ్డారు. కొద్ది రోజుల కిందట టీడీపీ నేతలు విడుదల చేసిన తప్పుడు నివేదికను ప్రస్తుతం జనసేనాని చదివి వినిపించిన స్క్రిప్ట్‌ను పోల్చి చూస్తే..పెద్దగా తేడాలేదని ఆయన అన్నారు. మీకు సినిమాల్లో రైటర్లు స్క్రిప్ట్ ఇస్తారని, కానీ రాజకీయాల్లో చంద్రబాబు మీకు స్క్రిప్ట్ ఇస్తారని అంతే తేడా అంటూ అమర్నాథ్ జబర్దస్త్ పంచ్ వేశారు. గతంలో పార్ట్‌టైమ్ పెయిడ్ పొలిటీషియన్‌గా ఉన్న పవన్ కల్యాణ్..శనివారం నాడు ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌తో ఫుల్ టైమ్ పెయిడ్ ఆర్టిస్ట్‌గా మారారంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ చురకలు అంటించారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాల్లో విమర్శలు చేస్తే ఆహ్వానిస్తాం కానీ…ఇలా..చంద్రబాబు స్క్రిప్ట్‌నే చదివితే విలువ ఉండదని, ప్రజలు కూడా నమ్మరంటూ…పవన్ కల్యాణ్‌కు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
