మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించడంతో పాటు టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిలు కలసి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. తిరుమలకు చేరుకునే ముందు చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ చెవిరెడ్డి ఏర్పాటు చేసిన వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.