రాష్ట్ర ప్రభుత్వం ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో కొత్తగా మరో 4 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కొండగట్టు అంజనేయ స్వామి, ధర్మపురి లక్ష్మినర్సింహా స్వామి, వరంగల్ భద్రకాళీ, జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ….తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల్లో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందని, ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలివిడతలో యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, బాసర, మహంకాళి, బల్కంపేట, కర్మన్ఘాట్ ఆలయాల్లో ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. దీంతో మొత్తం 11 ప్రధాన ఆలయాల్లో ఆన్ లైన్ సేవలు అందుబాలోకి వచ్చాయన్నారు. “T APP FOLIO” మొబైల్ యాప్, మీ సేవా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా సుప్రభాతం,అభిషేకం,అర్చన, వ్రతాలు,హోమాలు, వాహన సేవలు, దర్శనం, గదుల బుకింగ్, ఇతర సేవలను పొందవచ్చని వివరించారు. ఆన్ లైన్ లోనే విరాళాలు చెల్లించవచ్చన్నారు. ఆన్ లైన్ లో సేవలు అందుబాటులోకి తేవడం వల్ల భక్తుల విలువైన సమయం ఆదా అవుతుందని, పారదర్శకతతో పాటు దళారుల ప్రమేయం లేకుండానే సులభ దర్శనంతో పాటు ఇతర సేవలు పొందవచ్చని తెలిపారు.