టీడీపీకి ప్రకాశం జిల్లాలో భారీ షాక్ తగులుతుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగిన సమయంలో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ 4 సీట్లు గెలుచుకుంది. అందులో అద్దంకి నుండి గొట్టిపాటి రవి కుమార్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో ఇదే నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి రవి ఆ తరువాత టీడీపీలోకి ఫిరాయించారు. మళ్లీ గడిచిన ఎన్నికల్లో అద్దంకి గెలిచారు. అయితే ఇప్పుడుగొట్టిపాటి రవి టీడీపీలో మనస్పూర్తిగా కొనసాగటం లేదని తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాల్లోనూ అంతగా పాల్గొనటం లేదు. ఇదే సమయంలో రవితో బీజేపీ నేతలు సైతం మంతనాలు సాగించారు. కానీ, రవి తిరిగి వైసీపీకి రావాలని ప్రయత్నిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు సైతం సై అన్నట్లుగా తెలుస్తోంది.కొందరు మధ్య వర్తులు వైసీపీలో జగన్ కు సన్నిహితంగా ఉండే నేతలతో రవి తిరిగి వైసీపీలోకి తీసుకొనే అంశం పైన చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. రవి అనుచరులు సైతం పార్టీ మారాలనుకుంటే తిరిగి వైపీపీలోకి వెళ్లాలని సూచించినట్లు చెబుతున్నారు. అయితే, వైసీపీలోకి రావాలంటే ఇప్పటికే జగన్ తన విధానం స్పష్టం చేసారు. ఎమ్మెల్యే ఉన్న వారు తమ పదవులకు రాజీనామా చేసి వైసీపీ లోకి రావాలని స్పష్టం చేసారు. గొట్టిపాటి రవి విషయంలో ముఖ్యమంత్రి జగన్ సైత ఓకే చెప్పారని వైసీపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
