టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అప్పుడే జోస్యం చెప్పడం మొదలుపెట్టారు. రానున్న ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి ఎన్నికల బరిలోకి దిగుతాయని అన్నారు. ఆదివారం నాడు నర్సీపట్నంలోని తన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ..దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుగానే రానున్నాయని.. ఈ మేరకు రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటాయని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే ఈ మూడు పార్టీలు తెరవెనుక స్నేహం చేస్తున్నాయని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలతో ఆ పుకారు మరింత బలమైనది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు కు మద్దతు పలికిన పవన్ మొన్న జరిగిన ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసినప్పటికీ తెరవెనుక కొన్ని ఒప్పందాలు చేసుకున్నట్టు చాలానే ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో జనసేన అభ్యర్ధి లేకపోవడం ఈ అనుమానాలకు మరింత దారి తీస్తుంది. మరోవైపు టీడీపీ నుండి నలుగురు ఎంపీలు బీజేపీలో చేరడంతో వారిపై ఉన్న కేసులు నుండి బయటపడడానికే ఆ పార్టీలో చేరారని ఇప్పటికే పలు విమర్శలు ఉన్నాయి. అవి అలా ఉండగా ఇప్పుడు అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.