కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్ రాజకీయపరంగా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న కొన్ని సంభాషణలపై భాజపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ డైలాగులపై బీజేపీ నేతలు మండిపడుతుంటే, కాంగ్రెస్, డీఎంకే పార్టీలతోపాటు త్వరలో రాజకీయాల్లోకి రానున్న కమలహాసన్ కూడా మెర్సెల్‌కు మద్దతుతెలిపారు. తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు హెచ్.రాజా మాట్లాడుతూ, తాను మెర్సెల్ పైరసీ కాపీని చూశానని.. సినిమాలోని డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
దీంతీ ఆయన చేసిన వ్యాఖ్యలపై హీరో విశాల్ మండిపడ్డాడు. ఒక జాతీయ నేత స్థాయిలో ఉండి పైరసీ సినిమా చూశానని చెప్పడం అత్యంత దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సంఘంలో పెద్దమనిషిగా ఉంటూ, పైరసీ సినిమా చూశానని చెప్పడానికి సిగ్గు లేదా.. అని ప్రశ్నించాడు. ఇలాంటి పని చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని… పైరసీ లింకులను తొలగించడానికి ప్రభుత్వానికి సహకరించాలని డిమాండ్ చేశాడు. మరో సీనియర్ నటుడు పార్తీబన్ కూడా హెచ్ రాజా వ్యాఖ్యలను తప్పుబట్టారు. మరోవైపు తమిళనాడులో తీవ్ర దుమారం రేపిన ఈ అంశంలో.. కమల్ హాసన్, రజనీకాంత్‌తో సహా.. కోలీవుడ్ మొత్తం మెర్సల్‌కు అండగా నిలిచింది.. రాజకీయంగానూ మెర్సల్‌కు మద్దతు లభిస్తోంది. ఇప్పటికే డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ మద్దతు ప్రకటించారు.