పోలవరం విషయంలో సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావుపై ఏపీ ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో సీఈ సుధాకర్ బాబును నియమించారు. ప్రస్తుతం ఈ బదిలీ వ్యవహారం ఏపీ రాజకీయ, ఇంజనీరింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైయస్ హయాం నుంచి పోలవరం చీఫ్ ఇంజనీర్‌గా ఉన్న వెంకటేశ్వరరావును తప్పించడానికి గల కారణాలు బయటకు వచ్చాయి. ఇటీవల పోలవరం ప్రాజక్ట్‌పై పోలవరం ప్రాజెక్టు అధారిటీ కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చింది. అయితే పీపీఏలో సభ్యుడిగా వెంకటేశ్వరరావు పోలవరం నిర్మాణ పనుల్లో రివర్స్ టెండరింగ్‌కు వెళుతూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టినట్లు తెలుస్తోంది.
అయితే గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనుల్లో జరిగిన అవినీతిని బయటకు తీసుకురావాలని సీఎం జగన్ పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హయాంలో పని చేసిన అధికారి చీఫ్ ఇంజనీర్‌గా ఉంటే గత ప్రభుత్వ అవినీతిని బయటకు తీసుకురాలేమని భావించిన సీఎం జగన్ వెంకటేశ్వరావుకు పోలవరం అధారిటీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, ఇక నుంచి రాష్ట్ర నీటిపారుదల ఇంజనీర్ ఇన్‌చీఫ్‌గా కొనసాగాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్యుడిగా వెంకటేశ్వరరావు స్థానంలో సిఈ సుధాకర్ బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సుధాకర్ బాబు ఇకపై పోలవరం చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించనున్నారు. పోలవరంలో జరిగిన అవినీతిపై కేంద్రం కూడా దృష్టి పెట్టిన వేళ..ఏపీ సర్కార్ చీఫ్ ఇంజనీర్‌ను తప్పించడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. మొత్తంగా పీపీఏకు కొత్తగా సుధాకర్ బాబు రావడంతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. దీంతో చంద్రబాబు, లోకేష్‌లకు, నాటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు చిక్కులు తప్పవని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.