నగరానికి జ్వరం పట్టుకుంది. డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వ్యాదులు విజృంభిస్తున్నాయి. పట్టణాల నుంచి పల్లెల వరకు ఆస్పత్రులన్నీ జ్వర పీడితులో కిటకిటలాడుతున్నాయి. ప్రధాన హాస్పిటల్స్‌లో సిబ్బంది, ఇతర సదుపాయాల కొరత ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రుల వైపు పరుగులు పెడుతున్నారు. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. సీజనల్ వ్యాధులపై కేంద్ర వైద్య శాఖ రాష్ట్ర వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. అందుకనుగుణంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పలు చర్యలు తీసుకొంటోంది. కొన్ని ఆస్పత్రుల్లో ఆదివారం కూడా ఓపీ సేవలను ఓపెన్ చేసింది.
సికింద్రాబాద్, కంటోన్మెంట్ పరిధిలో డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు అధికమయ్యాయి. పికెట్, తిరుమలగిరి, బోయిన్ పల్లి ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఔట్ పేషెంట్ విభాగానికి రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారని, ఇందులో డెంగ్యూ బారిన పడిన వారు ఎక్కువగా ఉన్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. రోజుకు 250-300 మంది వచ్చేవారని..ఇప్పుడా ఆ సంఖ్య 400కి చేరిందని..మెడికల్ సూపరిటెండెంట్ ఆఫ్ కంటోన్మెంట్ డాక్టర్ మంజురాణి తెలిపారు. కంటోన్మెంట్ డిస్పెన్షరీల్లో 50 నుంచి 70 వరకు వైరల్ ఫీవర్ కేసులున్నాయన్నారు. దోమకాటు జబ్బుల్లో గ్రేటర్ హైదరాబాద్ పోటీ పడుతోంది. ఏటా సగటున నగరంలో 400 నుంచి 300 కేసులు నమోదవుతున్నాయి. నగరాలు, పట్టణాల్లో డ్రైనేజీ, వరద నీటికి వేర్వేరు కాల్వలు లేవు. దీంతో నల్లా నీళ్లతో పాటు భూగర్భ జలాలు కూడా కలుషితం అవుతున్నాయి.కలరా, డయేరియా, కళ్లకలక, వైరల్ హైపటైటీస్, టైఫాయిడ్ వంటి జబ్బులు వస్తున్నాయి. కలుషిత జలాల కారణంగా దేశంలో రోజుకు ఏడుగురు చనిపోతున్నారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ హెల్త్ ఇంటలిజెన్స్ నివేదిక పేర్కొంది. గత ఏడాది 2 వేల 439 మంది చనిపోగా..ఐదేళ్లలో 11 వేల 768 మంది చనిపోయారు. ప్రజలందరికీ సాధారణ వేళల కంటే అదనపు వేళల్లో వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు.