దివంగత ముఖ్యమంత్రి వైయస్ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల తిరుపతి క్షేత్రం ఖ్యాతి దేదీప్యమానంగా వెలిగిపోయింది. వైయస్ టీటీడీలో పలు సంస్కరణలు చేపట్టి…తిరుమల రూపురేఖలు పూర్తిగా మార్చి వేశారు. అర్చకులకు వేతన వ్యవస్థ ఏర్పాటు చేసింది కూడా వైయస్ హయాంలోనే కావడం విశేషం. అయితే ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఎందుకనో హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత కనపరుస్తారు. ఆధ్యాత్మిక , దైవ సంబంధిత కార్యక్రమాల్లో కూడా చెప్పులు వేసుకుని నిర్వహించడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా టీటీడీని బాబు భ్రష్టు పట్టించారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ఛైర్మన్‌గా క్రిస్టియానిటీ స్వీకరించిన అనిల్‌కుమార్ యాదవ్‌ను నియమించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతే కాదు టీటీడీ ఉద్యోగులుగా క్రైస్తవ మతానికి చెందిన వారి నియామకం కూడా బాబు హయాంలోనే జరిగింది. అయితే ప్రస్తుత ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తిరుమలలో పని చేస్తున్న అన్యమతస్థులందరూ స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని కోరారు. ఇక బెజవాడలో రోడ్ల వెడల్పు పేరుతో నలభైకు పైగా హిందూ దేవాలయాలను కూలగొట్టించాడు. దేవాలయాల కూల్చివేతపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్రతో సహా..పలువురు స్వామిజీలు, ధార్మికవాదులు నిరసన తెలిపారు.
తాజాగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీశైలం దేవస్థానంలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. శ్రీశైలం ఆలయంలో పనిచేసే ఉద్యోగుల్లో ఎవరు ఎప్పుడు నియమితులయ్యారనే వివరాలతో ఆలయ ఈవో కేఎస్ రామారావు.. దేవదాయ శాఖ కమిషనర్ పద్మకు శనివారం నివేదికను అందజేశారు. ఆలయంలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల్లో ముగ్గురు, మరో 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అన్యమతస్తులేనని తెలుస్తోంది. ఈ 14 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో తొమ్మిది మంది చంద్రబాబు సీఎంగా ఉన్న 1998–2003 మధ్య నియమితులైనవారేనని శ్రీశైలం దేవస్థానం ఈవో నివేదికలో పేర్కొన్నారు. మరో ఐదుగురు 2010–11లో ఉద్యోగాలు పొందారని వివరించారు. ముగ్గురు రెగ్యులర్ ఉద్యోగుల్లో ఒకరు చంద్రబాబు సీఎంగా ఉన్న 2001లోనూ, మిగిలిన ఇద్దరు 1982, 1993లో నియమితులయ్యారని తెలిపారు. 1993లో చేరిన రెగ్యులర్ ఉద్యోగిని దేవదాయ శాఖ తొలగించినప్పటికీ.. అతడు కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నాడని.. 2014లో చంద్రబాబు సర్కారే తిరిగి అతడిని ఆలయంలో ఉద్యోగిగా నియమించింది. శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగుల అన్యమతస్థుల నియామకం చంద్రబాబు హయాంలోనే జరిగిందనే వార్త ఇప్పుడు ఏపీలో కలకలంగా మారింది. ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ దుష్ప్రచారంచేసింది. అయితే ఈ బస్ టికెట్ల ముద్రణ గత ఐదేళ్ల బాబు పాలనలోనే జరిగిందని ప్రభుత్వ విచారణలో తేలింది. ఇప్పుడు తాజాగా శ్రీశైలం దేవస్థానంలో ఉద్యోగులుగా అన్యమతస్థుల నియామకం చంద్రబాబు హయాంలోనే జరిగిందని అధికారులు ప్రకటించారు. మొత్తంగా ప్రముఖ దేవాలయాల పవిత్రత మంట కలిపేందుకు, హిందూవుల మనోభావాలను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడని మరోసారి రుజువైంది.