కర్ణాటక ప్రీమియర్ లీగ్(కేపీఎల్)లో ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో మేటి ప్రతిభ చూపి అదరహో అనిపించాడు. బళ్లారి టస్కర్స్ జట్టు తరపున బరిలోకి దిగిన గౌతమ్ ఈ టోర్నమెంట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 39 బంతుల్లో శతకం నమోదు చేశాడు. 56 బంతుల్లో 7 ఫోర్లు, 13 సిక్సర్లతో 134 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కేపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు, అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. గౌతమ్ భీకర ఇన్నింగ్స్‌తో టస్కర్ నిర్ణీత 17 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన షిమోగా లయన్స్ టీమ్‌ను బంతితో గౌతమ్ వణికించాడు. అతడి ధాటికి లయన్స్ బ్యాట్స్‌మన్ పెవిలియన్‌కు వరుస కట్టారు. ఏకంగా 8 వికెట్లు పడగొట్టి లయన్స్‌ను మట్టికరిపించాడు. కేపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. గౌతమ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 70 పరుగుల తేడాతో లయన్స్ పరాజయం పాలైంది. 16.3 ఓవర్లలో 133 పరుగులు చేసి ఆలౌటైంది. బలాల్(40), దేశ్‌పాండే(46) మినహా మిగతా ఆటగాళ్లందరూ విఫలమయ్యారు. ఒంటిచేత్తో టస్కర్స్ను గెలిపించిన కృష్ణప్ప గౌతమ్ ‘మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.