కృష్ణా నది ప్రవాహం .. దాని ఉపనదుల ప్రవాహ వివరాలు.. వాటి ప్లడ్ తీవ్రతకు సంబంధించిన లెక్కలు..
గేట్లు ఎప్పుడెత్తాలి ఎప్పుడు దించాలి అనే సూచనలు.. ప్రవాహాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి..అనే హెచ్చరికలు..
ఇవన్నీ వొక మ్యాప్ మీద ఎవరన్నా వివరిస్తున్నరనుకో…మనం ఏమనుకుంటాం.? ఆయన వొక ఇర్రిగేషన్ ఇంజనీరో, ఫ్రొఫెసరో, లేదా ప్రాజెక్టులు కట్టిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రో., అనుకుంటాం.వరదలు వచ్చినప్పుడు కానీ, ప్రాజెక్టుల నిర్మాణాలప్పుడు కానీ తీసుకోవాల్సిన సాంకేతిక పాలనాపరమైన వ్యవహారాలను వివరిస్తున్నడు కావచ్చు అనుకుంటాం. కదా..కానీ వొక విచిత్రమైన పరిస్తితిలో వొక విచిత్రమైన వ్యక్తి నాటి ఉమ్మడి ఆంధ్రా చివరాకరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టైపులో కట్టెపట్టుకోని చెప్తున్నడు అదేదో టీవీల చూసిన ఇప్పుడే. రిమోట్ ను వొత్తబోయేటోన్నల్లా ఆగిసూశిన..యేమన్న కొత్త ప్రాజెక్టు గురించి చెప్తున్నడా యేంది.., ఆంధ్రా రైతులకోసం ఆలోచనగిట్ల చేస్తున్నడా యేంది.. జగన్ ప్రభుత్వానికి ఏమన్నా సలహా ఇస్తున్నడా యేంది.. అని..తలకాయ సాగబెట్టిమరీ చూసిన.
కానీ అది అదికాదు..
మనమెవరమూ ఊహించలేనిది
మన ఊహల్లోకి కూడా రాని వో మనిషి
అదేమిటి ఆయన ఎవరూ అంటే..
చంద్రబాబు నాయుడు., ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్.
కరకట్టలోొ అక్రమంగా కట్టిన తన నివాసం మునగకుండా చూడడం ఎలా…అనే అంశం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారులకు నిన్న మొన్న పదవిపోయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్లాసుపీకుతున్నడు. వాల్ల టీవీ ఛానల్లు దాన్ని లైవ్ ఇస్తున్నయి.
వొక సీనియర్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ లెవల్లో వంకర ముకం పెట్టి ఆయన కరకట్ట ముంపులో కట్టుకున్న ఇల్లు ముంపునకు గురయిన విధంబును వివరిస్తున్నడు. అక్కడితో ఆగలేదు. ఇంకా.. తన నివాసాన్ని ముంచడానికి జగన్ ప్రభుత్వం కుట్రలు పన్నినారనే చిత్ర విచిత్ర ఆరోపణలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు జతచేసి గుప్పిస్తున్నడు. ప్రభుత్వం క్రుత్రిమ వరదలు స్రుష్టిస్తున్నరని..గమ్మతి గమ్మతి ఆరోపణలు చేస్తున్నడు.
అప్పటికే నీను సూస్తలేను…అక్కడికి మా శంకరిగాడు వచ్చి చూసుకుంట నిలవడిన సంగతి.
హవ్వ హవ్వ ..యేందిసార్ ఇదిఅని., జుట్టుపీక్కుంట కింద పడి బొర్లుడు సురుచేసిండు ..బాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసినంక.ఎప్పటిలాగే..
యెవరయ్యా అక్కడ..చంద్రబాబు ప్రోగ్రాం వస్తున్నప్పుడు ఈ శంకరిగాన్ని జర కనిపెట్టుకుంట తిరగండయా అంటే వినరుకదా .చంద్రబాబు తిత్లీతుఫానప్పుడు సముద్రాలను కంట్రోల్ చేస్త నని అన్నపుడు..వొకసారి..ఎండలను తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీచేసినపుడు..మరోసారి..కూడా ఇట్లనే జుట్టుపీక్కుంట కిందబడి బొర్లిండు. జర్రల ప్రాణాపాయం తప్పింది…ఆనాడే. కనిపెట్టుకుంట తిరగండయా….అని నీను కోప్పడుతుండగానే…అలవాటు ప్రకారం ఆని చేతిల తాళం చేతులుపెట్టి రుద్దుతున్నరు..మా ఆఫీసు స్టాఫ్.
– హజారి