గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారథ్యంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం..అద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. త్రిదండి చినజీయర్ స్వామి సలహాలు, సూచనలతో, పాంచరాత్ర ఆగమ శాస్త్ర పద్దతిలో, భగవత్ రామానుజ సంప్రదాయంలో యాదాద్రి నిర్మితమవుతుంది. దాదాపు 1000 ఎకరాల్లో అద్భుతమైన ఆలయ నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇక 2.33 ఎకరాల్లో చేపట్టిన సువిశాలమైన ఆలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఆలయ ప్రాంగణాలన్నీ వాస్తు, శిల్ప కళా వైభవంతో అలరారనున్నాయి. ప్రధాన ఆలయానికి తూర్పు, దక్షిణం, ఉత్తరం వైపున పంచతల రాజగోపురాల నిర్మాణం దాదాపుగా పూర్తి అయింది. ఆలయ మహారాజ గోపురాలకు కుడిఎడమలుగా జయవిజయులను ప్రతిష్ఠించడం ఆనవాయితీ. దేశంలోనే ఎక్కడాలేని విధంగా 11 అడుగుల ఎత్తులో గర్భాలయ ముఖ ద్వారానికి ఇరువైపులా జయవిజయుల విగ్రహాలను ప్రతిష్టంచనున్నారు.
తూర్పు రాజగోపురం నుంచి వెళ్లగానే కర్ణకూటం కనిపించే విధంగా తీర్చిదిద్దారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా ధ్వజ స్థంభం కోసం బలిపీఠం నిలబెట్టారు. వాటికి బంగారు తొడుగులు చేయించనున్నారు. ఇక యాదాద్రిలో ప్రత్యేక ఆకర్షణగా అష్టభుజి మండపం నిలువనుంది. గర్భాలయంలో ఉప ఆలయాలైన ఆండాల్ అమ్మవారి ఆలయం, క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి , నమ్మాళ్వార్, రామానుజాళ్వార్ల ఆలయాలు కూడా పూర్తయ్యాయి. ఆండాల్ అమ్మవారి ఆలయానికి మధ్య స్వామివారి శయన మందిరాన్ని నిర్మించి, శయన నారసింహుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ శయన మందరాన్ని అద్దాలతో ఆకర్షణీయంగా తీర్చి దిద్దుతున్నారు. ఇక ప్రథమ ప్రాకారం, త్రితల గోపురం నుంచి ఆలయ దర్శనం కల్పించనున్నారు.
యాదాద్రి ఆలయ నిర్మాణంలో మొత్తం 2 లక్షల 50 వేల టన్నుల శిలల వినియోగించారు. దేశంలోనే తొలిసారిగా కృష్ణ శిలలతో మహారాజగోపురం నిర్మించడం జరిగింది. తంజావూరు తరహాలో అపూర్వమైన ఈ మహా రాజగోపురం నిర్మాణానికి దాదాపు 20 వేల టన్నుల కృష్ణ శిలలు వినియోగించడం విశేషం. ఆలయ మహా మండపంలో 12 మంది ఆళ్వార్ల విగ్రహాలు ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడు, ప్రహ్లాదుడు, యాదవ మహర్షి విగ్రహాలు ప్రతిష్టంచారు. యాదాద్రిలో ప్రతిఒకేసారి 750 జంటలు కూర్చుని వత్రం చేసుకునే విధంగా భారీ వ్రత మండపాన్ని నిర్మించారు.
యాదాద్రికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు కావున రవాణ ఇబ్బందులు తలెత్తకుండా 6 లేన్ల రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. టెంపుల్ సిటీ నిర్మాణలో భాగంగా ఏకంగా 143 ఎకరాల్లో బస్టాండ్, క్యూ కాంప్లెక్స్‌లు, అన్నదాన సత్రాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రస్తుతం ఆ పనులు జోరందుకోనున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు యాదాద్రి నిర్మాణ పనులపై పర్యవేక్షిస్తూ…అధికారులకు తగిన సూచనలు ఇస్తున్నారు. ఈ డిసెంబర్‌లోగా యాదాద్రి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఈ మేరకు అధికారులకు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ..యాదాద్రి టెంపుల్ సిటీ నిర్మాణపనులను పరిగెత్తిస్తున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో త్రిదండి చినజీయర్ స్వామిజీ ఆధ్వర్యంలో మహా సుదర్శన యాగం నిర్వహించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. యాగం ఏర్పాట్లకై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తంగా సీఎం కేసీఆర్ చిరకాల స్వప్నం అయిన యాదాద్రి తెలంగాణలోనే అద్భుతమైన దివ్య క్షేత్రంగా రూపుదిద్దుకుంటోంది…తెలంగాణలోనే కాదు , తిరుమల తిరుపతిని మరిపించేలా యావత్ దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా యాదాద్రి ప్రసిద్ధి చెందుతుందనడంలో సందేహం లేదు.