అన్న క్యాంటీన్లపై రెండు రోజులుగా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది పచ్చ బ్యాచ్. పసుపురంగు పోయి, అన్న అనే పదం కనిపించకుండా పోయేసరికి వీరి సొంత ఇంటికి వైసీపీ నేతలు రంగు వేయించినట్టుగా ఫీలైపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లకు కొత్త రంగులు వేయించింది జగన్ సర్కార్. వీటిని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి సరికొత్తగా ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రణాళిక రచించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు అన్న క్యాంటీన్ ని మూసివేశారు. దీంతో పేదలంతా ఆకలితో అలమటించారట. అన్న క్యాంటీన్ల ముందు చోటా మోటా నేతలంతా ఒకరోజు నిరసన ప్రదర్శన చేపట్టారు.
అన్న క్యాంటీన్లో అన్నం దొరక్క ప్రజలు నకనకలాడిపోతున్నారంటూ మొసలికన్నీరు కార్చారు. అసలు అన్న క్యాంటీన్లు పెట్టకముందు పేద ప్రజలు ఏం తినేవారు, ఎక్కడ తినేవారు. అన్న క్యాంటీన్లో రోజుకు ఎంతమంది పేదల కడుపు నింపుతున్నారు, అదీ ఎంత మూల్యానికి. మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ పథకాన్ని మొదటి మూడేళ్లు మూలనపడేసి, చివర్లో తూతూ మంత్రంగా తెరపైకి తెచ్చిన టీడీపీ ప్రభుత్వం ఇక్కడ కూడా వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది. ఆహార సరఫరాని కాంట్రాక్ట్ సంస్థకి అప్పగించి వారి దగ్గర్నుంచి కమిషన్ తీసుకునేది.
ఇక వచ్చిన వారందరికీ వడ్డిస్తారా అంటే అదీ లేదు. లిమిట్ పెట్టేసరికి పేదవాళ్లు క్యూలైన్లలో నిలబడలేక, నిలబడినా తమవంతు వచ్చేసరికి భోజనం ఉంటుందో లేదో తెలియక అసలు క్యాంటీన్ల వైపు చూడటమే మానేశారు. తూతూమంత్రంగా క్యాంటీన్లు నడుపుతూ కమీషన్లు మెక్కుతున్న నిర్వాహకులు, సీఎం జగన్ వీటిపై దృష్టిసారించే సరికి ఇబ్బంది పడిపోతున్నారు. పేద ప్రజల ఆకలి పూర్తిస్థాయిలో తీర్చేందుకు క్యాంటీన్ల నిర్వహణపై నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్. అంతలోకే టీడీపీ ఎగిరెగిరి పడుతోంది, పేదవాడి నోటి దగ్గర కూడు లాగేశారంటూ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది.