మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరి కోసం నిలబడతానని హామీ ఇచ్చారు. తన కుటుంబం గొప్ప కుటుంబం కావాలన్నది తన లక్ష్యం కాదని, ప్రజలు గొప్పవారు కావాలన్నదే తన ఆశ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని స్పష్టం చేశారు. సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని, మండలస్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, బూత్ స్థాయి కమిటీలకు సంబంధించిన బాధ్యతలు తీసుకున్నవారు గట్టిగా కృషి చేయాలన్నారు. అక్టోబర్ నుంచి క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, పార్టీ ఓటమి వల్ల తాను ఇబ్బంది పడటంలేదన్నారు. జనంలోకి వెళ్లేందుకు ఎందుకు బయపడాలన్నారు.
జనసేన నాయకులు ఏమైనా ఘోరాలు చేశారా నేరాలు చేశారా అని నిలదీశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చింది ఒంటరిగా పోటీచేసి గెలవలేక కాదని పార్టీని మరింత విస్తృత పరచాలనే ఉద్దేశంతో అప్పుడు పోటీ చేయలేదన్నారు. పసిబిడ్డకి పంచ భక్ష్యాలు పెడితే అరగదు అంటూ చెప్పుకొచ్చారు. జనసేన పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ నలుగురు బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ, వైసీపీ, బీజేపీలతో ప్రత్యక్షంగా యుద్ధం చేస్తే, టిఆర్ఎస్‌తో పరోక్షంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవస్థను నడపాలి అంటే పది మంది నాయకులు కావాలని వారు నచ్చలేదు వీరు నచ్చలేదు అంటే కుదరదన్నారు. జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే తన లక్ష్యమన్నారు. ఒక వ్యవస్తను నడిపించేందుకు కాస్త సమయం పడుతుందని అది తనకు బాగా తెలుసునన్నారు.
తాను స్థిరంగా, బలంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తానని తెలియజేశారు. తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదని కేవలం రాష్ట్రం బాగుండాలి అని మాత్రమే కోరుకుంటున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తే హర్షిస్తాం. ప్రజలను ఇబ్బందులు పెడితే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తన మొదటి సినిమా ఫెయిల్ అవగానే ఉద్యోగం చేసుకోమంటూ కొందరు సలహా ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఓడిన చోటే వెతుక్కుంటూ వెళ్లానని అదే ఈ స్థాయిలో నిలబెట్టిందన్నారు. ఆఫీస్ ఉంటుందా, పార్టీ నడుపుతారా.? అంటూ గేలి చేస్తున్నారు. తాము ఎవరినీ డబ్బులేం అడగలేదే.. అవసరం అయితే టెంట్లు వేసుకుని పార్టీని నడుపుతామన్నారు. తనకు పదవులే కావాలంటే.. అప్పుడే అన్నయ్య వెంట వెళ్తే ఎప్పుడో కేంద్రమంత్రిని అయ్యేవాడినని పవన్ చెప్పుకొచ్చారు.