కాపు రిజర్వేషన్లపై కాపునేత ముద్రగడ పద్మనాభం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి రాసిన లేఖ సంచలనం సృష్టిస్తోంది. ఆ లేఖలో జగన్ పై ముద్రగడ మండిపడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యా జగన్ గారు.. తాను కూడా మీ సోదరి షర్మిల లాంటి వాడినేనని తెలిపారు. కొద్దిరోజులక్రితం సోదరి షర్మిల మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు రావడంతో ఆమె బాధతో, ఆవేదనతో హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసే పరిస్ధితి వచ్చింది. అలాగే ఇపుడు తనపై కాపు ద్రోహి, స్వార్థపరుడు, దొంగ, అమ్ముడు పోయాడు ముద్రగడ అంటూ ఎన్నో తప్పుడు వార్తలను అన్ని పార్టీల వారు రాయిస్తున్నారని, వాటికి బెదిరిపోవడానికి.. తానేమీ ఎన్ఆర్ఐని కాదని గుర్తుంచుకోండి అంటూ జగన్‌కు సూచించారు. అయితే ఈ లేఖపై వెలువడిన కొద్దిసేపట్లోనే కాపు రిజర్వేషన్లపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు.
ఈ కమిటీలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కన్నబాబు, అంబటి రాంబాబు ఉంటారు. కాపు రిజర్వేషన్లు, కేంద్ర చట్టంపై ఈ కమిటీ అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. కాపు రిజర్వేషన్లపై వైసీఎల్పీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయి కాపు రిజర్వేషన్లతో పాటు ఈబీసీ బిల్లుపై చర్చించారు. ఈసమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్‌తో పాటు ఎమ్మెల్యే అంబటి రాంబాబు తదితర కాపు నేతలు హాజరయ్యారు. అనంతరం కాపు నేతలు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. వీరిని ఉద్దేశించి మాట్లాడిన జగన్ కాపు రిజర్వేషన్లపై అప్పటి ప్రభుత్వ వైఖరిని కోరుతూ ఏప్రిల్ 4న కేంద్రప్రభుత్వం రాసిన లేఖను ప్రస్తావించారు. అయితే ఆ లేఖకు నాటి సీఎం చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని నేతలు తెలిపారు. ఈ క్రమంలో జగన్ వద్ద తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. అయితే ముద్రగడకు ముఖ్యమంత్రి జగన్ ని ప్రశ్రించే హక్కు అధికారం ఏమాత్రం లేవని, ముద్రగడ చంద్రబాబు టికెట్ ఇస్తే పోటీ కూడా చేద్దామనుకున్నాడని, జరిగినదంతా మర్చిపోయి టీడీపీలోకి వెళ్లాలనుకున్న మాట వాస్తవం కాదా అని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. కాపుల్ని బీసీల్లో చేరుస్తానని జగన్ ఏనాడూ చెప్పలేదని, తనవల్ల కాదు అనే నిజాన్ని ఆనాడే జగన్ ఒప్పుకున్నారని ముద్రగడకు గుర్తు చేస్తున్నారు.