ఏపీ సీఎంగా పదవి చేపట్టిన 50 రోజుల్లోనే పాలనలో పలు సంచలనాత్మక నిర్ణయాలు, విప్లవాత్మక సంస్కరణలతో దూసుకువెళ్లడం జాతీయ మీడియా జీర్ణించుకోలేకపోతుందా…జగన్ నిర్ణయాలపై అప్పుడే బురద జల్లుతున్నాయా అంటే…తాజాగా జాతీయ మీడియా ఛానళ్ల కథనాలు చూస్తే నిజమే అనిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ ఏపీలోని పరిశ్రమల్లో స్థానికులకే 75 % ఉద్యోగాలు కల్పించేందుకు ఒక బిల్లును తీసుకువచ్చారు. తాజాగా ఆ బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ఇక నుంచి ఏపీలో ఉన్న, రాబోయే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. అవసరమైన ఆయా ఉద్యోగాలకు సంబంధించి నైపుణ్య శిక్షణ ప్రభుత్వమే ఇస్తుంది. ఇక నుంచి స్థానికులకు 75 శాతం…స్థానికేతరులకు 25 శాతం ఉద్యోగాలు మాత్రమే దక్కుతాయి. వాస్తవంగా ఇది మంచి నిర్ణయం..స్థానికంగా నిరుద్యోగ సమస్య తీరుతుంది.
స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అయితే జాతీయ మీడియా ఛానళ్లు జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికే విరుద్దం అంటూ విరుచుకుపడుతుంది. ఇంతకీ జాతీయ మీడియా ఇంతలా ఉలిక్కిపడడానికి కారణం… తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిగా ఉన్న తమ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల్లంతు అవుతాయనే భావనతో జాతీయ మీడియా ఛానళ్లు ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అంటూ కూనిరాగాలు తీస్తున్నాయి. ఇప్పుడు ఏపీలో ఈ చట్టం అమలు అయితే…పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఇదే ఫాలో అవుతారన్నది జాతీయ మీడియా భయం. అయితే జగన్ నిర్ణయం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అనే ముందు జాతీయ మీడియా ఛానళ్లు ఈ ప్రశ్నలకు బదులు ఇవ్వమని మా దరువు.కామ్ డిమాండ్ చేస్తోంది.
1. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో ప్రకటించి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ…ప్రత్యేక హోదాను గాలికి వదిలేయడం…
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కాదా…?
2. గత ఐదేళ్లలో చంద్రబాబుతో కుమ్మక్కై విభజన హామీలను తుంగలో తొక్కి, ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు రేకెత్తించి కేంద్రం చోద్యం చూడడం..ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కాదా…?
3. రాష్ట్రాల నుంచి వేలాది కోట్లు పన్నులు వసూలు చేసుకుంటున్న కేంద్రం..బడ్జెట్లో ఉత్తరాది రాష్ట్రాలకే మొత్తం నిధులన్నీ కేటాయించి, తెలుగు రాష్ట్రాలకు చిల్లగవ్వ కూడా విదిలించకపోవడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కాదా..?
4. తెలుగు రాష్ట్రాలలో దేశంలోనే మెరుగైన ఆరోగ్య శ్రీ పథకం ఉండగా పెద్దన్న హోదాలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రాష్ట్రాల మీద రుద్దడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా…?
5. కర్నాటకలో అధికార బలంతో కుమార సర్కార్‌ను దించేసి, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం…ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా…?
6. రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, నియంతృత్వంగా వ్యవహరిస్తూ ఆయా రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం..
ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా…
7. భౌగోళికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కతికపరంగా దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష పాటించడం… ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా…?
9. ఏపీ ప్రజల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఉత్తరాది రాష్ట్రాల వారు కొల్లగొట్టడం…ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా…?
10. ఉత్తరాది రాష్ట్రాలలో విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దెబ్బతీయడం… ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం కాదా..?
ఏ రాష్ట్రమైన తమ ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటుంది…అందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఏపీ సీఎం వైయస్ జగన్ పరిశ్రమలల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
కల్పించాలని చట్టం చేశారు. మీకు చేతనైతే మీ ఉత్తరాది రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను అక్కడి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమని డిమాండ్ చేయండి…స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా..ఇంకా ఉత్తరాది రాష్ట్రాలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండడం మీ పాలకుల అసమర్థత, కేంద్రం నిర్లక్ష్యం..ముందు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తే తెలుగు రాష్ట్రాలకు వలస రావాల్సిన ఖర్మ ఎందుకు..అర్జెంట్‌గా జగన్ మీద పడి ఏడవడం కంటే..ఉత్తరాది రాష్ట్రాల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమంటూ అక్కడి పాలకులకు గడ్డిపెట్టండి..మీకు దమ్ముంటే ప్రధాని మోదీ గారిని నిలదీయండి..అంతే కాని..ఏపీలో ప్రజల బతుకులను నిలబెట్టాలనే తాపత్రయంతో సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అంటూ బిల్లు చేస్తే ..ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం అంటూ రెచ్చిపోకండి…ముందు మా పది ప్రశ్నలకు జవాబు ఇవ్వండి…ఆ తర్వాత ఫెడరల్ స్ఫూర్తి అంటూ పెద్ద మాటలు మాట్లాడండి..దట్సాల్.