వైసీపీ అధికారంలోకి వచ్చినతర్వాత జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తొలి సస్పెన్షన్ జరిగింది. అసెంబ్లీ కార్యకలాపాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటువేశారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకు ఇది అమల్లో ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రూలింగ్ ఇచ్చారు. సభనుంచి సస్పెండ్ అయిన వారిలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఉన్నారు. అసెంబ్లీ ప్రారంభంకాగానే స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రశ్నోత్తరాల సెషన్ కు అనుమతిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, 45సంవత్సరాల ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పెన్షన్, పంచాయతీరాజ్ శాఖలో నిలిచిపోయిన పనులపై టీడీపీ సభ్యుల ప్రశ్నలు అడిగారు.. వీటికి సంబంధిత మంత్రులు సమాధానాలిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్ల విషయంలో టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు ప్రభుత్వాన్ని నిలదీశారు.
దీనిపై మంత్రి పెద్దిరెడ్డి వివరణతో సంతృప్తి చెందని టీడీపీ ఎమ్మెల్యేలు.. వైసీపీ ఎన్నికల హామీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టగా టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. సస్పెన్షన్ ఓకే చెప్పిన డిప్యూటీ స్పీకర్ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు అడ్డుపడుతున్నారనే కారణంతో ముగ్గురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ను శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనతో ఏకీభవించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి .. అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడుపై వేటువేశారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు సభను వీడలేదు. అక్కడే ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మార్షల్స్ బలవంతంగా వారిని బయటకు తీసుకెళ్లిపోయారు. అయితే సీఎం మాత్రం తాను ఫించన్ ఇస్తానని మ్యానిఫెస్టోలో పెట్టలేదని, పాదయాత్రలో ఆ ఆలోచన చేసిన మాట వాస్తవమేనని, కానీ అప్పుడు వచ్చిన సలహాలను దృష్టిలో పెట్టుకుని వారికి ఫించన్లకు బదులుగా వైఎస్సార్ ఆసరా పేరుతో రుణాలిస్తానని చెప్పిన వీడియో ప్రదర్శించి నచ్చజెప్పారు. అయినా వారు వినకపోవడంతో వారిపై వేటు వేసారు. టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కూడా ప్రజానీకం ఆమోదించినట్టుగా తెలుస్తోంది.