ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జగన్ దేవుడు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇది తన మాట కాదని మత్స్యకారులు అంటున్నారని రాపాక అన్నారు. సముద్రం లో వేటకు వెళ్లే జాలర్లకు రూ.10లక్షలు కేటాయించడంతో వారంతా తాము కోరుకున్న కోర్కెలు తీర్చేది గంగమ్మ తల్లి అయితే కోరకుండానే తీర్చే దేవుడు జగన్ అంటూ కొనియాడుతున్నారని రాపాక అన్నారు. వైసీపీ తమ మేనిఫెస్టోని దైవగ్రంథాలతో పోల్చడం ప్రశంసనీయమని, మేనిఫెస్టో ఒకటో పేజీ నుంచి చివరిపేజీ వరకు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఉన్నాయని చెప్పారు. ఏ ఉద్దేశంతో భగవద్గీతతో పోల్చారో కానీ బడ్జెట్ మాత్రం చాలా పారదర్శకంగా ఉందన్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు రాపాక. పవన్ అధికారపక్షం మాట్టాడిన వెంటనే వ్యతిరేకించమని తనకు చెప్పలేదని, ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఉంటే మద్దతు తెలపమన్నారని వివరించారు. రైతులకు వ్యవసాయాన్ని పండుగలా చేసే సీఎం వైయస్ అయితే రైతు భరోసా పథకం కింద రూ.28వేల కోట్లు కేటాయించిన జగన్ కూడా అలాంటి వ్యక్తేనని అన్నారు. రాపాక మాట్లాడుతున్నంత సేప వైసీపీ ఎమ్మెల్యేలు హంగామా చేశారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మీరు జనసేనా జగన్ సేనా అంటూ సెటైర్లు వేశారు. అయితే జనసేన కార్యకర్తలు మాత్రం రాపాకను ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారు. దేవుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని గెలిపిస్తే జగన్ ని పొగుడుతున్నావా అంటే దుర్భాషలాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా మాత్రం పవన్ రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట రెండోస్థానం, మరోచోట మూడోస్థానంలో ఉన్నారని రాపాక తన సొంతంగా గెలిచారంటూ విమర్శిస్తున్నారు.